భారతీయులు స్థానిక బొమ్మలపై మక్కువ పెంచుకోవాలని, ఈ రంగంలోని వారంతా దేశీయ బొమ్మలకు ‘గొంతుక’ కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో వినియోగిస్తున్న బొమ్మల్లో దాదాపు 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటున్నామని, వీటినే కొనడంతో వేలకోట్ల ధనం విదేశాలకు తరలిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం రూ.11 వేల కోట్లమేరకే ఉందని ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వర్చువల్ వేదికగా జరిగిన టాయ్‌కాథాన్–2021లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు.
బొమ్మల ఆర్థిక వ్యవస్థ(టాయ్ ఎకానమీ–టాయ్‌కానమీ)లో భారత స్థానం మరింతగా మెరుగుపడాలని ఆయన అభిలషించారు. ఆట వస్తువుల తయారీ, గేమింగ్ పరిశ్రమల్లో ప్రపంచ విపణిలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ పరిశ్రమ దేశీయంగా వృద్ధిచెందితే సమాజంలో ఈ రంగంపై ఆధారపడ్డ వర్గాలకు మేలు జరుగుతుంది. గ్రామీణులు, దళితులు, పేద ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో దేశీయంగా చిన్నతరహా ఆట వస్తువుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. వీరందరి జీవితాలు మరింతగా వృద్ధిలోకిరావాలంటే మనందరం స్థానిక బొమ్మలనే కొందాం’అని మోదీ పిలుపునిచ్చారు.