ఈ ఎన్నిక‌లు క‌ర్నాట‌క భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తాయి…

PM Modi Says Present Elections Decide Karnataka State Future

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌కలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు రాష్ట్ర భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించ‌బోయే ఎన్నిక‌ల‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు వ‌స్తుంటాయి, పోతుంటాయ‌ని, కానీ ప్ర‌భుత్వం మారాలి అని ఇంత బ‌లంగా కోరుకోవ‌డం చూడ‌డం ఇప్పుడేన‌ని మోడీ అన్నారు. క‌ల్బుర్గిలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు. ఎన్నిక‌లంటే ఎమ్యెల్యేల‌ను ఎన్నుకోవ‌డం మాత్ర‌మే కాద‌ని, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, రైతుల అభివృద్ధికి సంబంధించిన అంశ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు.

గ‌తంలో బీజేపీ క‌ర్నాట‌క‌లో అధికారంలో ఉన్న‌ప్ప‌డు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసింద‌ని, కానీ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని తిరోగ‌మ‌న బాట ప‌ట్టించింద‌ని ప్ర‌ధాని ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుడు ప్రచారాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని, కాంగ్రెస్ పాల‌న‌లో బ్రాండ్ క‌ర్నాట‌క దెబ్బ‌తింద‌ని ప్ర‌ధాని మండిప‌డ్డారు. నీటివ‌న‌రులు అధికంగా ఉన్న‌ప్ప‌టికీ…నీళ్లు అందించ‌లేక‌పోతోంద‌ని, రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర అందించే అంశంలోనూ క‌ర్నాట‌క కాంగ్రెస్ అశ్ర‌ద్ధ చూపించింద‌ని స్వామినాథ‌న్ క‌మిటీ నివేదిక‌ను క‌ప్ బోర్డులో పెట్టుకుంద‌ని మోడీ ఎద్దేవాచేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ మోస‌పూరిత రాజ‌కీయాలు చేస్తోంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను ముఖ్య‌మంత్రిగా చేస్తాన‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అలా చేయ‌కుండా…ద‌ళిత క‌మ్యూనిటీని మోసం చేసింద‌ని, ద‌ళితుల‌కు కాంగ్రెస్ గౌర‌వం ఇవ్వ‌ద‌ని ప్ర‌ధాని విమ‌ర్శించారు. మ‌న సైనికుల త్యాగాల‌కూ కాంగ్రెస్ ఏమాత్రం గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌ని, సైనికులు స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు సర్జిక‌ల్ స్ట్రైయిక్ జ‌రిపితే…వాటికి ఆధారాలు చూపాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింద‌ని మోడీ మండిప‌డ్డారు.

వందేమాత‌రాన్నే గౌర‌వించ‌లేని వ్య‌క్తి నుంచి దేశ‌భ‌క్తిని ఆశించ‌డం వృథా అని మోడీ మండిప‌డ్డారు. గ‌తంలోనూ కాంగ్రెస్ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డింద‌ని అన్నారు. క‌ర్నాట‌క శౌర్యానికి ప్ర‌తీకని, కానీ రాష్ట్రానికి చెందిన సైనికులు ఫీల్డ్ మార్ష‌ల్ క‌రియ‌ప్ప‌, జ‌న‌ర‌ల్ తిమ్మ‌య్య‌ల ప‌ట్ల నాటి కాంగ్రెస్ స‌ర్కార్ ఎలా ప్ర‌వ‌ర్తించిందో మ‌న‌కు తెలుస‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు. పాకిస్థాన్ తో గెలిచిన త‌ర్వాత 1948లో వారిని అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి నెహ్రూ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి కృష్ణ‌న్ మీన‌న్ అవ‌మాన‌ప‌రిచార‌ని అటువంటి చ‌రిత్ర కాంగ్రెస్ ద‌ని మోడీ విమ‌ర్శించారు.