అక్షయ్ కుమార్ తో మోడీ స్పెషల్ ఇంటర్వూ….ఆసక్తికర అంశాలు

తాను ప్రధానమంత్రిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని, పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తనకు ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం అంటే చాలా ఇష్టమని, ఆ అలవాటే తనను రాజకీయాలవైపు నడిపించిందని అన్నారు. తాను కఠినంగా ఉంటానని వస్తున్న వ్యాఖ్యలు నిజమేనని, కానీ, తాను ఎవరినీ అవమానించబోనని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేంత వరకూ తన బట్టలను తానే ఉతుక్కునేవాడినని ఎక్కడికి వెళ్లినా విడిచిన దుస్తులు ఉతికి ఆరేసుకునే అలవాటు ఉండేదని అన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డ మోదీ, సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. మూమూలు సమయాల్లో తాను సాయంత్రం 5 గంటలకెల్లా డిన్నర్ ముగించేస్తానని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారు పడే కష్టమే వారిని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని చెప్పారు. సోషల్ మీడియా అంటే తనకెంతో ఆసక్తి ఉందని, మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా, సాంకేతికత అందించే సౌలభ్యాలను అందిపుచ్చుకోవడం తనకు ఇష్టమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం తనకు బాగా అలవాటైందని, అందువల్లే ఒత్తిడిలో సైతం పని చేస్తున్నానని అన్నారు. చిన్నతనంలో తనకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఎంతో బలంగా ఉండేదని గుర్తు చేసుకున్న మోదీ, ఆ కోరిక మరో రకంగా తీరుతోందని చెప్పారు. తానెంత బిజీగా ఉన్నప్పటికీ, తన తల్లికి మాత్రం సమయాన్ని కేటాయిస్తూనే ఉంటానని, ఆమెతో గడిపే సమయం తనకెంతో విలువైనదని అన్నారు. సన్యాసి జీవితానికి తాను అలవాటు పడిపోయానని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విపక్ష నేతల్లో తనకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారని, ప్రతి ఒక్కరిలోనూ కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ నేత ఆజాద్ తనకెంతో ఆప్తమిత్రుడని, నిత్యమూ తనను తిడుతూ ఉండే మమతా బెనర్జీ సైతం మిత్రురాలేనని, ఆమె ప్రతి సంవత్సరం తనకు మిఠాయిలు పంపుతుంటారని గుర్తు చేసుకున్నారు. స్వీట్స్ తో పాటు కొత్త దుస్తులను కూడా అమె పంపుతూ ఉంటుందని చెప్పారు. తొలిసారి తాను ఎమ్మెల్యే అయ్యేంత వరకూ బ్యాంకు ఖాతా కూడా లేదని మోదీ చెప్పారు. గుజరాత్ సీఎంగా పని చేసినప్పుడు తన బ్యాంక్ ఖాతాలో 30 లక్షల రూపాయలు ఉండేవని, ప్రధానిగా ఢిల్లీకి వచ్చే ముందు ఆ మొత్తం నుంచి 21 లక్షలను తన స్టాఫ్ కు ఇచ్చేశానని మోదీ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని ఎంతో మంది సరిగ్గా అంచనా వేయలేరని అభిప్రాయపడ్డారు. సీఎంగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అనుభవం ఇప్పుడు తనకు దేశ సేవ చేసేందుకు ఉపకరిస్తోందని మోదీ పేర్కొన్నారు. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని, తన శరీరానికి నాలుగు గంటల నిద్ర సరిపోతుందని, అలసటగా ఎన్నడూ అనిపించదని అన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయిన తరువాత నిద్రకు అధిక సమయం కేటాయిస్తానని చెప్పారు. ఆయుర్వేదంపై నమ్మకం అధికమని, ఏదైనా రుగ్మతగా అనిపిస్తే, ఆయుర్వేద మందులనే తీసుకుంటానని అన్నారు.