రష్యా-ఉక్రెయిన్ వార్‌పై ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న ముడి చమురు ధరలపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అధికారులతో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్దం వేళ గురువారం క్వాడ్ దేశాధినేతలు వర్చువల్ విధానంలో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సమావేశమై కీలక చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలపై కీలక చర్చలు జరిగే అవకావం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు రష్యా వార్ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు చేరుకుంది. వారం రోజుల్లో ముడి చమురు ధరలు దాదాపు 20 శాతానికిపైగా పెరిగాయి. పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర 80 డాలర్ల లోపు ఉన్న సమయంలోనే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరుకున్న విషయం తెలిసిందే.