మోడీ స్క్రిప్ట్ మారింది….ఏమి ఖర్మో…!

PM Narendra Modi On Grand Alliance

ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో మోదీ మేనియాతో ఎన్డీయే సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిణామాల వల్ల ఇప్పుడాయన ప్రభావం సన్నిగిల్లుతోంది. దీనికి తోడు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. ఆ పార్టీ బీజేపీకి దూరమైన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీతో కలవడంతో మోదీ అండ్ కోలో టెన్షన్ మొదలైంది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రాహుల్ గాంధీతో సహా పలు పార్టీల అధినేతలతో భేటీ కూడా అయ్యారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్-టీడీపీ పొత్తును మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆ మధ్య ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ కలయిక అనివార్యమైందని, భవిష్యత్ తరాలను కాపాడడానికి ఈ కలయిక చారిత్రక అవసరం అని చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీల కలయిక గురించి చాలా పార్టీలు పలు రకాల కామెంట్లు చేశాయి. కానీ, భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ నేతలు మాత్రం నోరు మెదపలేదు. అటువంటిది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు. అంతేకాదు, ఎన్టీఆర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ ఆదివారం మాట్లాడారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఎన్డీయేను మరోసారి అధికారంలోకి రానీయకూడదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై మోదీ మండిపడ్డారు. ఈ సందర్భంగా దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్ టీ రామారావు పోరాడారని తమిళనాడు బీజేపీ కార్యకర్తలకు మోడీ ఓ పాఠంలా చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రానికి చెందిన… రాజకీయ ప్రముఖుడు గురించి.. తమకెందుకు చెబుతున్నారో బీజేపీ నేతలకు అర్థం కాలేదు. కానీ అది వీడియో కాన్ఫరెన్స్ చెప్పేది వినడం తప్ప ఎదురు మాట్లాడే చాన్స్ ఉండదు. చాన్స్ ఉన్నప్పటికీ మాట్లాడే అవకాశం రాదు కూడా. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్‌టీ‌ఆర్ పోరాడారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటోందని విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని అందుకు కాంగ్రెస్‌తో జత కడుతోందని.. విమర్శించారు. రాజవంశీకులు, సంపన్నులు ఓ సంఘంగా ఏర్పడ్డారని, వీరి కూటమి ఓ గందరగోళ కూటమి అని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత మనుగడ కోసమే ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పడుతోంది. అధికారం కోసమే ఈ కూటమి.. ప్రజల కోసం కాదని మోదీ వ్యాఖ్యానించారు. ఇంకా చాలా విమర్శలు చేశారు కానీ తమిళ కార్యకర్తలకు మోడీ ఇదంతా తమకు ఎందుకు చెబుతున్నారో మాత్రం అర్థం కాలేదు. ఏపీలో బీజేపీ కార్యకర్తలకు చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ తమిళనాడులో అంతంత మాత్రం ఉనికి ఉన్న కాంగ్రెస్ అసలు పోటీ చేసే అవకాశం లేని టీడీపీ గురించి ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోలేకపోయారు. చివరికి తేలింది ఏంటయ్యా అంటే మోడీ తెలుగు రాష్ట్రాల కార్యకర్తలతో మాట్లాడేందుకు రాసుకున్న స్క్రిప్ట్ పొరపాటున తమిళనాడు వాళ్లకి చదివి వినిపించేసారు అన్నమాట.