ప్ర‌ధాని సోష‌ల్ మీడియా టార్గెట్లు

PM Narendra Modi Targeting Social Media Usage In 2019 Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ 2014 ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డంలో సోష‌ల్ మీడియా ఎంత కీ రోల్ ప్లే చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మోడీ టెక్నాల‌జీని వినియోగించుకోవ‌డంలో దేశంలోని రాజ‌కీయ‌నాయ‌కులంద‌రికంటే ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని ఈ విజ‌యం రుజువుచేసింది. ప్ర‌ధాని అయిన త‌ర్వాత కూడా మోడీ సోష‌ల్ మీడియాను వ‌దిలిపెట్ట‌లేదు. ప్ర‌భుత్వ పథ‌కాలు ప్ర‌చారం చేయ‌డానికి, త‌న మ‌న‌సులో భావాలు వెల్ల‌డించడానికి… ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి…ఇలా ప్ర‌తి విష‌యానికి సోష‌ల్ మీడియాను మోడీ ఉప‌యోగించుకుంటున్నారు.

సామాజిక మాద్య‌మాల్లో మోడీ ఇలా యాక్టివ్ గా ఉండడం చూసి బీజేపీ నేత‌లంతా ఇలానే ఉన్నార‌ని మ‌నం అనుకుంటే పొరపాటు ప‌డ్డ‌ట్టే..ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్రామ్ వంటి మాద్య‌మాల ఉప‌యోగంలో మోడీ దూసుకుపోతుంటే..ఆయ‌న స‌హ‌చ‌ర ఎంపీలు మాత్రం సోష‌ల్ మీడియా వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డంలేదు. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేసేందుకో,  ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప్ర‌చారంచేసేందుకో సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకోవ‌డంపై  బీజేపీ ఎంపీలెవ‌రూ ఆస‌క్తిచూప‌డంలేదు. ఇదే మోడీకి చిరాకు క‌లిగించింది. తాను సోష‌ల్ మీడియాను విస్తృతంగా ఉప‌యోగించుకుని…ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటోంటే…ఎంపీలు మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంపై మోడీ మండిప‌డ్డారు. బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఈ విష‌యంపైనే ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. సోష‌ల్ మీడియాలో టార్గెట్లు నిర్దేశించారు. మూడు గంట‌ల‌పాటు సాగిన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో సోష‌ల్ మీడియాను వినియోగించుకోవ‌డంపైనే ఎక్కువ చ‌ర్చ జ‌రిగింది.

ఈ స‌మావేశంలో మోడీకి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంగ‌తి ఒక‌టి తెలిసింది. బీజేపీ ఎంపీల్లో 43 మందికి ఫేస్ బుక్ ఖాతా లేవ‌ని, అకౌంట్లు ఉన్న‌వారిలో కూడా 77 మందికి వెరిఫికేష‌న్ పూర్తి కాలేద‌ని తెలిసి ప్ర‌ధాని నిర్ఘాంతపోయారు.  ఎంపీలంతా వెంట‌నే ట్విట్ట‌ర్ లో అధికారిక ఖాతాలు తెర‌వాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. ఒక్కో ఎంపీకి క‌నీసం మూడు ల‌క్ష‌ల‌మంది ఫాలోయ‌ర్లు ఉండాల‌ని టార్గెట్ విధించారు. ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు విమ‌ర్శ‌లు ఎండ‌గ‌ట్టేందుకు ఎంపీలంతా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని, వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియజేయ‌డానికి టెక్నాల‌జీ ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. మొత్తానికి 2019 ఎన్నిక‌ల్లో కూడా సోష‌ల్ మీడియాను ఉప‌యోగించి గెలుపు గుర్రం ఎక్కాల‌ని మోడీ ఆలోచ‌న‌లా క‌నిపిస్తోంది.