అమిత్ షా పై దాడి కేసు… బీజేపీ నేత అరెస్ట్…

Police arrested BJP leader over Amit Shah Convoy stone pelting in Tirupati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తిరుప‌తిలో అమిత్ షా పై దాడి కేసులో బీజేపీ నేత కోలా ఆనంద్ కుమార్ ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే టీడీపీ అనుబంధ సంఘం టీఎన్ ఎస్ ఎఫ్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య యాద‌వ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా కోలాను అరెస్ట్ చేశారు. కోలాతో పాటు ఆయ‌న అనుచరుడు బ‌ట్ట‌వాటి రాజశేఖ‌ర్ పై ఐపీసీ సెక్ష‌న్ 341,323, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్ద‌రినీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. వారిద్ద‌రికీ న్యాయ‌మూర్తి బెయిల్ మంజూరుచేశారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తిరుమ‌ల‌ ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ… ప్ర‌త్యేక హోదా డిమాండ్ తో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఈ నెల 11వ తేదీన నిర‌స‌న‌ల‌కు దిగారు. ఈ క్ర‌మంలో అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ నేత‌లు రాళ్లు విస‌ర‌గా… అవి కోలా ఆనంద్ కారు అద్దాల‌ను తాకాయి. కారు అద్దాలు ప‌గ‌ల‌డంతో కోలా ఆనంద్, ఆయ‌న అనుచరులు తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతూ టీడీపీ నేత‌ల‌పై దాడికి దిగారు.

ఈ ఘ‌ట‌న ఏపీ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకున్నాయి. దీంతో టీడీపీ నేత‌ సుబ్ర‌హ్మ‌ణ్య యాద‌వ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దాడికి గురైన త‌మ‌వారినే అరెస్ట్ చేశార‌ని తిరుమ‌తి ఎమ్మెల్యే సుగుణ ఆరోపించారు. టీడీపీ నేత‌లంతా ఆ రోజున పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న తెల‌ప‌డంతో సుబ్ర‌హ్మ‌ణ్యయాద‌వ్ కు ఆ రోజే బెయిల్ ఇచ్చారు. కోలా ఆనంద్ ను అరెస్ట్ చేస్తామ‌ని ఆ సంద‌ర్భంగా పోలీసులు హామీ ఇచ్చారు. అనంత‌రం టీడీపీ నేత‌ల ఫిర్యాదు మేర‌కు ఇప్పుడు కోలా ఆనంద్ ను అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూర‌యిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన కోలా ఆనంద్ టీడీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అమిత్ షా పై దాడికి పాల్ప‌డిన వారిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని చెప్పిన ముఖ్యమంత్రి ఇంత‌వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు.