నూతన్‌ నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు

నూతన్‌ నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్‌ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య మధుప్రియతో మాట్లాడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో పరారీలో ఉన్న నూతన్‌ నాయుడును కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించిన అతడిపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనూ నూతన్‌ నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, కాబట్టి అతడిపై రౌడీషీట్‌ తెరవాల్సిందిగా ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.