బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంపై బెంగళూరు పోలీసులు గురువారం సోదాలు చేశారు. మత్తుమందుల కేసులో నిందితుడిగా ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా కోసం ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిత్యపై ఓ కేసు నమోదు కాగా అతడు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘ఆదిత్య సమాచారం తెలియడంతో కోర్టు వారెంట్‌తో అతడి బంధువైన వివేక్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు’ అని కమిషనర్ చెప్పారు.
తనిఖీల ఫలితం ఏమిటన్నది మాత్రం వివరించలేదు. ఆదిత్య మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆళ్వా కుమారుడు. రేవ్‌పార్టీలు, మత్తుమందు సరఫరాదారులు, అమ్మకం దార్లపై పోలీసులు విరుచుకుపడిన నేపథ్యంలో కన్నడ సినీనటులు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీసహా కొందరు నైజీరియన్లను అరెస్ట్ చేయడం తెల్సిందే. రెండు నెలల క్రితం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులు తాము నటులకు మత్తుమందులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతోనే ఈ అరెస్ట్‌లు జరిగాయని సమాచారం.