ఆ యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు సూళ్లూరుపేటకు వచ్చింది. కుమార్తె కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే స్పందించి ఆమెను కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్కిల్ పరిధిలోని పెదవేగికి చెందిన యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
గడిచిన సంవత్సర కాలంగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన వేములసాయి కోసం సోమవారం ఉదయం తన ఊరి నుంచి బయలుదేరి సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకుంది. ఉద్యోగం ఇప్పించాలని అతడిని కోరింది. ఉద్యోగం తీసిచ్చేవరకు తడ మండలం కొండూరులోని ఓ హాస్టల్‌లో ఉండమని సాయి యువతిని వదిలిపెట్టి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు యువతి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసి సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నట్టుగా కనుక్కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు ఈ విషయంపై సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై రవిబాబు, నైట్ బీట్‌లో ఉన్న సిబ్బంది జార్జి, ప్రదీప్, కిరణ్ సమయస్ఫూర్తితో యువతి ఫోన్ ఆధారంగా లోకేషన్ గుర్తించి హాస్టల్‌కు వెళ్లారు.
అక్కడ వార్డెన్‌ను విచారించారు. పెదవేగి పోలీసులు అందించిన ఆధారాలతో యువతిని గుర్తించి నిర్ధారించుకుని మహిళా కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఆమెను తీసుకొచ్చారు. ఆ యువతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడించారు. మంగళవారం బాధిత యువతి తల్లిదండ్రులు, పెదవేగి పోలీసులు సమక్షంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వారికి అప్పగించారు. యువతి ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ చూపించిన ఎస్సై రవిబాబుకు, ఇతర సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు ప్రకటించగా వాటిని డీఎస్పీ అందజేశారు.