ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన పోలీస్ అధికారి అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. ఆదివారం శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఎస్ఐ అర్షిద్ అహ్మద్ మీర్ (25) అంత్యక్రియలు కుప్వారా జిల్లాలోని స్వగ్రామం కలమునాలో జరిగాయి. అర్షిద్ మీర్ మృతదేహం చేరుకునేసరికే వేలాది మంది జనం అక్కడకు తరలివచ్చి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న ఓనిందితుడ్ని వైద్య పరీక్షల కోసం శ్రీనగర్ శివారులోని ఖన్వార్ ఆస్పత్రికి ఎస్ఐ తీసుకెళ్లగా.. అక్కడే తుపాకితో కాల్చి ఉగ్రవాదులు హత్యచేశారు.
ఎస్ఐ మృతిపై జమ్మూ కశ్మీర్ డీపీజీ దిల్బాగ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మేం ధైర్యవంతుడైన యువ అధికారిని కోల్పోయాం… ఓ నిందితుడ్ని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపారు’ అని తెలిపారు. కుట్రదారుడ్ని గుర్తించామని, యువ అధికారికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తొలుత శ్రీనగర్‌లో అమరుడైన ఎస్ఐకు డీజీపీ ఆధ్వర్యంలో పోలీసులు, సీఏపీఎఫ్ అధికారులు, బంధువులు నివాళులర్పించారు. కోల్పోయిన ప్రతి ప్రాణం మనల్ని ఆందోళనకు గురిచేస్తుందని, నేరపూరిత చర్యలకు పాల్పడిన వారిని త్వరలో కోర్టు ముందుకు తీసుకురానున్నామని చెప్పారు. గతేడాది జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగంలో చేరి శిక్షణ పూర్తిచేసుకున్న మీర్.. కొద్ది నెలల కిందటే ఖన్యార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పోస్టింగ్‌లో చేరారు.
ఎస్ఐపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తీరు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. పక్క నుంచి వచ్చిన ఉగ్రవాది పాయింట్ బ్లాక్‌లో తుపాకితో కాల్చాడు. మూడు బుల్లెట్లు ఆయన తలలోకి దూసుకెళ్లాయి. కాల్పుల తర్వాత అక్కడ నుంచి నిందితుడు తప్పించుకోడానికి ప్రయత్నించగా.. ఓ వ్యక్తి అతడి వెనుక పరుగెత్తాడు. కానీ, వెంటనే రక్తపు మడుగులో పడిపోయిన ఎస్ఐకు సాయం చేయడానికి వచ్చాడు. చికిత్స కోసం తరలించగా అప్పటికే అహ్మద్ మీర్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.