Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి మరో సంచలనకర విషయం వెల్లడయింది. దావూద్ ఇండియా తిరిగి రావాలని భావిస్తున్నాడని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం తప్పనేందుకు కీలక ఆధారం లభించింది. 1993 పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయి పాకిస్థాన్ చేరిన దావూద్… అక్కడినుంచే తన నేరసామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఆ క్రమంలోనే పాకిస్థాన్ నుంచే భారత్ పై మరో భారీ కుట్రకు దావూద్ ప్లాన్ చేశాడు. ముంబైలో మరోసారి మారణహోమం సృష్టించడానికి స్కెచ్ వేశాడు. తన అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడిచేయాలని దావూద్ పథకం రచించాడు.
దావూద్, అనీస్ ఇబ్రహీం మధ్య ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయడంతో ఈ కుట్ర బయటపడిందని ముంబై పోలీసులు చెప్పారు. దావూద్ వ్యూహం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తును వేగవంతం చేసి ఎనిమిదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెండున్నర దశాబ్దాల నుంచి పాకిస్థాన్ లో ఉంటున్న దావూద్ అక్కడినుంచే భారత్ లో అండర్ వరల్డ్ కార్యకలాపాలను శాసిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. అయితే ఆయన గురించి ఇటీవల ఓ వార్త వినిపించింది.
దావూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చివరిరోజులను భారత్ లో గడపాలనుకుంటున్నాడని, భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాడని వార్తలొచ్చాయి. అయితే దావూద్ సోదరుడు కస్కర్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు. దావూద్ కు భారత్ వచ్చే ఆలోచన లేదని, ఒకవేళ ఆయనకు ఆ ఉద్దేశం ఉన్నా… పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ ఐ గురించి ఎన్నో రహస్యాలు తెలిసిన దావూద్ ను భారత్ కు తిరిగి వెళ్లేందుకు ఆ దేశం అనుమతించబోదని కస్కర్ వెల్లడించాడు. దావూద్ కుట్ర విషయం గమనిస్తే… పాకిస్థాన్ సాయంతో భారత్ లో మారణ హోమం సృష్టించాలని ఆయన భావిస్తున్నట్టు అర్ధమవుతోంది.