టీవీ9కి మెయిన్ సంస్థ అయిన అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్యా కుదిరింది పాత ఒప్పందం కాదని, ట్రిబ్యునల్ లో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా రవి ప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇక శివాజీ NCLT లో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించగా, ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం 9 గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్ మీద రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది.