మానసిక వికలాంగుడైన తన కుమారుడిని ఆస్పత్రిలో చేర్చడానికి పోలీసుల సాయం కోరి వారికి ఫోన్ చేసింది తల్లి. కానీ పోలీసులు ఆ కుర్రాడిని ఆస్పత్రికి బదులు ప్రాణాపాయస్థితిలోకి తీసుకెళ్లి ఐసీయూలో చేర్చారు. హృదయవిదారకమైన ఈ సంఘటన సాల్ట్ లేక్ సిటీలో చోటు చేసుకుంది. వివరాలు.. గోల్డా బార్టన్‌కు 13 ఏళ్ల కుమారుడు లిండెన్ కామెరాన్ ఉన్నాడు. అతడు ఆస్పెర్గర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో అతడు అప్పుడప్పుడు అసాధరణంగా గొడవ చేసేవాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే.. సెట్ అయ్యేవాడు. గత శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బార్టెన్కు. దాంతో పోలీసులకు కాల్ చేసి.. లిండెన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సాయం చేయాల్సిందిగా కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు బార్టెన్ ఇంటికి వచ్చిన పోలీసులు లిండెన్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కుర్రాడు వీరిని చూసి భయపడి పారిపోయాడు.
దాంతో పోలీసులు లిండెన్ మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి పేగులు, మూత్రాశయం, భుజం, చీలమండలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. సాయం కోసం పోలీసులకు కాల్ చేస్తే.. వారు తన బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బార్టెన్. ‘నా బిడ్డ నిరాయుధుడు.. మానసిక వికలాంగుడు.
అలాంటి వాడి మీద ఇంత దారుణంగా దాడి చేయడం అమానుషం’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అయితే అమెరికాలో ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. కుటుంబ సభ్యులను కానీ, జనాలను కానీ ఇబ్బంది పెట్టే మానసిక వికలాంగులను అనేక మందిని పోలీసులు కాల్చి చంపారు. లిండెన్పై కాల్పులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సాల్ట్ లేక్ సిటీ మేయర్ ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.