ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అంతా షాక్ కు గురి కావాల్సి వచ్చింది. బైక్ ఆపారని ఆవేదనకు లోనైన ఓ వ్యక్తి ఏకంగా గొంతు కోసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో బయటకు రావొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. బైకులు, కార్లలో తమ ఇష్టానుసారంగా బయట తిరుగుతు ముఖ్యంగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. లాక్‌డౌన్ తొలి రోజుల్లో ఇలా బయటకు వచ్చిన వారికి లాఠీలతో బుద్ధి చెప్పిన పోలీసులు ఇప్పుడు రకరకాల శిక్షలు వేస్తున్నారు. తనిఖీల్లో దొరికిన బైకులను సీజ్ చేయడమే కాకుండా వారిపై కేసులు కూడా బనాయిస్తున్నారు.
అయితే తాజాగా పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తున్న అతడిని జగ్గంపేటలో పోలీసులు ఆపారు. ఎక్కడికి వెళ్తున్నావని పోలీసులు ప్రశ్నిస్తుండగా.. లోవరాజు అనే అతడు తన వద్ద ఉన్న బ్లేడుతో గొంతు కోసేసుకున్నాడు. దీంతో షాక్ కు గురైన పోలీసులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది అయితే ఈ ఘటనపై లోతుగా విచారించిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. అదేమంటే.. అతడు మద్యం మత్తుతో ఉండటం ఒక ఎత్తైతే.. కుటుంబ కలహాలు కూడా చోటు చేసుకోవడం అతడి ఆత్మహత్యకు మెయిన్ రీజన్ గా తెలిసి పోలీసులు విస్తుపోయారు.