కేరళలోని అలప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు రాజకీయ నేతలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది. హత్యకు గురైన వారిని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీ కేఎస్ షాన్, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్‌గా పోలీసులు గుర్తించారు.
శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తున్న కేఎస్ షాన్‌ను దుండగులు కారులో వెంబడించి ఢీకొట్టారు. అనంతరం ఆయన్ని విచక్షణా రహితంగా కొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని స్థానికులు కొచ్చిలోని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్‌పై దాడి జరిగింది.
ఆదివారం ఉదయం ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దారుణంగా హత్య చేశారు. న్యాయవాది అయిన రంజిత్ ప్రస్తుతం బీజేపీ స్టేట్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. 2016లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే రంజిత్‌ను చంపేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇద్దరు రాజకీయ నేతల హత్యలతో అలప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దీంతో ఆది, సోమవారాల్లో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన జిల్లావ్యాప్తంగా భద్రతా చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాత్మక చర్యలు రాష్ట్రానికి మంచిది కాదని, ఈ హత్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.