తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు వచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమి మీదకు తెచ్చి.. భూమి మీద నుంచి గోదావరి తెచ్చి.. గోదావరి నుంచి కాళేశ్వరానికి పారించారా అని అడిగారు రేవంత్ రెడ్డి. సభను హరీశ్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు చేశారు.. ఎన్ని రుణాలు తీసుకున్నారనే వివరాలను బయటకు తీస్తామని తెలిపారు. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ కుటుంబం వద్దనే నీటి పారుదల శాఖ ఉండటం విశేషం. ప్రజలను మభ్య పెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక తప్పు బట్టిందని సీఎం అసెంబ్లీలో తెలిపారు. 2015-16లోనే కాగ్ నివేదిక ఇచ్చిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అబద్దాలు చెప్పి, సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని సూచిస్తున్నారని తెలిపారు.