ఈనెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ఆయన పాలనపై దృష్టి సారించారు. వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై పట్టు సాధించే దిశగా ముందుకెళ్తున్నారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని అపాయింట్మెంట్ కావాలని సీఎంఓ కోరింది.
ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు పీఎంఓ అపాయింట్మెంట్ ఇవ్వడంతో వారు ప్రధాని మోదీని కలవనున్నారు. దిల్లీ పర్యటన కోసం ఖమ్మం పర్యటనను భట్టి విక్రమార్క రద్దు చేసుకున్నారు. సాయంత్రం నలుగున్నర గంటల సమయంలో ప్రధాన మంత్రితో సమావేశమవుతారని సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రస్తావించనున్నట్లు తెలిసింది.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా విభజన హామీల్లో కొన్ని పెండింగ్లోనే ఉండటంతో వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రధానిని కోరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.