ప్రజాదర్బార్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత పనితీరు, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లు, జరగనున్న పరీక్షలు తదితరాలపై రెండు రోజుల్లోనే ఓ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. జనవరిలో గ్రూపు-2 పరీక్షల నిర్వహించేలా షెడ్యూలు ఖరారైనందువల్ల ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులపైనా అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టతకు రానున్నది.
అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయన రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. దీంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఏడాదిన్నరగా పేపర్ లీక్‌లు, పరీక్షల వాయిదాతో టీఎస్పీఎస్సీ ప్రతిష్ఠ మసకబారిన సంగతి తెలిసిందే.