Political Updates: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Political Updates: CM Revanth Reddy's review on Telangana power sector
Political Updates: CM Revanth Reddy's review on Telangana power sector

హైదరాబాద్: విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్ శాఖకు చెందిన ఉన్న తాధికారులతో పాటు ట్రాన్స్ కో, జెన్కో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల స్థితిగతులు, డిమాండ్, కొనుగోళ్లు, బకాయిలు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం రెండు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయం, రూ.10 లక్షల విలువైన ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులతో సమావేశం కానున్నారు.

సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం అనంతరం గురువారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది.