Political Updates: ప్రధానితో ముగిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ..!

Political Updates: CM Revanth, Deputy CM Bhatti met with the Prime Minister..!

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమావేశం ముగిసింది. మంగళవారం సాయంత్రం దాదాపు అరగంట పాటు వారు ప్రధానితో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సి ఉన్న పెండింగ్ నిధులతో పాటు పలు కీలక అంశాలను వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా, ప్రధాని సానుకూలంగా స్పందించారని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం, దానిపై చర్చ తదితర పరిణామాలను వారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వ సహకారం అవసరమని; ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వారు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని కోరారు. హైవేల నిర్మాణానికి సహకరించాలని; బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇతర కర్మాగారాలకు నిధుల విడుదల అంశాన్ని కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన ఇవ్వాలని కోరారు. ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలుకు సహకరించాలని కోరడంతో పాటు మొత్తం 20 అంశాలపై ప్రధానికి వారు నివేదిక సమర్పించారు.