మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థ L&Tనే చేపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఒప్పంద, అనుబంధ పనులను సదరు సంస్థ చేపడుతోందని….బ్యారేజీకి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, మట్టిపని, డైవర్షన్ ఛానల్ లో ఇతర పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
20వ పియర్ తో పాటు ఇరువైపులా ఉన్న 18, 19, 21, 22 పియర్స్ కూడా కుంగాయని అధికారులు వెల్లడించారు. ఇక అటు కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్న తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.