త్వరలోనే కోలుకొని ప్రజల మధ్యకు వస్తానని, అందరినీ కలుసుకుంటానని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తనను కలుసుకునేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి మంగళవారం తరలివచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ఒక వీడియోను విడుదల చేశారు.
‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి తరలివచ్చిన వేల మంది అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఎక్కువమందిని కలిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య బృందం స్పష్టంగా తెలిపింది. ఆసుపత్రిలో వందల
మంది ఇతర పేషెంట్లు కూడా ఉన్నారు. వారి క్షేమం కూడా ముఖ్యం . దీన్ని గమనించి మీరందరూ మీ మీ స్వస్థలాలకు క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలి. బుధవారం నుంచి ఎవరూ తరలి రావద్దు. నేను మంచిగా అయిన తర్వాత.. రోజూ ప్రజల మధ్యే ఉండేవాణ్ని కాబట్టి తప్పకుండా కలుసుకుందాం . దయచేసి నా విన్నపాన్ని గౌరవించి వెంటనే తిరిగి వెళ్లిపోవాలి’’ అని గద్గద స్వరంతో కేసీఆర్ కోరారు.