అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామమందిర ట్రస్టు ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. తాజాగా రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు అందజేసింది. కాంగ్రెస్ నేతలు ముగ్గురినీ రావాలని కోరింది. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్జీ దేవేగౌడ కూడా ఆహ్వానాలను అందుకున్నారు.
రాబోవు రోజుల్లో మరింతమంది ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు, ప్రముఖులను శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ట్రస్ట్ కోరుతున్న విషయం తెలిసిందే. అతిథులకు మర్యాదలు చేసేందుకు అయోధ్యలో కొత్తగా తీర్థక్షేత్రపురాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆరు కిచెన్లు, పది బెడ్ల ఆసుపత్రి, 150 మంది వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు. రామమందిర ప్రారంభోత్సవ క్రతువులో పాల్గొనేందుకు 4వేల మంది సాధువులను ఆహ్వానించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది.