తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మరో 24 గంటల్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎల్పీగా ఆయణ్ను ప్రకటించిన మరుక్షణమే రేవంత్ దిల్లీకి పయనమయ్యారు. ప్రస్తుతం ఆయన దిల్లీలో పలువురు అగ్ర నేతలను కలుస్తున్నారు. గురువారం రోజున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆయన పలువురు కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు. ప్రమాణానికి రేవంత్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలతో పాటు ఇతర ఏఐసీసీ ముఖ్య నేతలను ఆహ్వానించనున్నారు.
ప్రస్తుతం దిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం ఆయన ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ఆహ్వానించనున్నారు. అలాగే మంత్రివర్గ ఏర్పాటు, ఇతర విషయాలపై చర్చించనున్నారు. మరోవైపు తనను సీఎల్పీగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర నేతలందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు.