తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల రాక, పెద్దఎత్తున జనం తరలిరానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఏర్పాట్లను డీజీపీ రవి గుప్తా పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రేపు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందని వెల్లడించారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్, వసంతకుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.