ఇటీవల పార్లమెంట్లో లోక్ సభ సమావేశాలు జరుగుతండగా ఇద్దరు ఆగంతకులు అక్రమంగా చొరబడిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు 6 రాష్ట్రాలకు బయల్దేరాయి. రాజస్థాన్, హరియాణా, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ బృందాల వెంట నిందితులు కూడా ఉన్నారు. వీరితో పాటు మరో 50 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ 50 బృందాలువి నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వపరాలను సేకరిస్తున్నాయి.
పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనిపెట్టారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో అతడు ఫోన్లను దహనం చేసినట్లు గుర్తించిన పోలీసులు.. కాలిపోయిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతోన్న సమయంలో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్ శర్మ, మనోరంజన్ లోక్సభలో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అలజడి వెనక కుట్ర త్వరలోనే బయటపడుతుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.