తెలంగాణ శాసనసభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు, తీసుకున్న రుణాలు, పెండింగ్ బకాయిలు.. ఇతర వివరాలతో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసింది. దాదాపు 42 పేజీలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయగా.. దాన్ని చదివేందుకు కూడా సమయం ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు వాపోయారు. ఒకరోజు ముందుగానే తమకు ఆ నివేదిక ఇచ్చి ఉంటే అసెంబ్లీలో సమాధానం ఇవ్వడానికి సులభంగా ఉండేని అభిప్రాయపడ్డారు.
ఓవైపు రాష్ట్ర సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయగా.. మరోవైపు రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత్ రాష్ట్ర సమితి ఓ డాక్యుమెంట్ను విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్లో KCR హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను పొందుపరిచింది. ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే డాక్యుమెంట్ను బీఆర్ఎస్ విడుదల చేయడం గమనార్హం. అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా BRS వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది.