జనగామ నుండి పొన్నాల అభ్యర్థిత్వం ఖరారు

Ponnala-Lakshmaiah-MLA-Of-J

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ఎంత జాప్యం గా వ్యవహరిస్తుందో తెలిసిన విషయమే. ఇప్పటికే తెరాస పార్టీ తన అభ్యర్ధులని ప్రకటించి, ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. కానీ, మహాకూటమిలో గల పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడానికి తర్జనభర్జనలు పడుతున్నాయి. ముఖ్యంగా జనగామ నియోజకవర్గం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలి అనే విషయమైన కాంగ్రెస్ పార్టీ కి, తెలంగాణ జన సమితి పార్టీ కి మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగాయి. జనగామ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా టీజేఎస్ పార్టీ స్థాపకుడు కోదండరాం నిలబడాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ, అది కాంగ్రెస్ పార్టీ కి చెందిన ప్రముఖ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య యొక్క నియోజకవర్గం కావడం, కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా పొన్నాల ను నిలబెట్టాలని అనుకోవడం వలన ఈ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం జరిగింది.

Mahakutami Finalises On Deepavali

ఎట్టకేలకు మహాకూటమి తరపున జనగామ నియోజకవర్గం అభ్యర్థి ఎన్నిక ఖరారు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత మరియు మాజీ మంత్రి అయిన పొన్నాల లక్ష్మయ్య మహాకూటమి అభ్యర్థిగా జనగామ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఈ అభ్యర్థిత్వం ఖరారు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా నిన్న శుక్రవారం రాత్రి ప్రకటన చేశారు. ఈ టిక్కెట్ విషయమై తలెత్తిన అభిప్రాయబేధాల విషయమై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నాంపల్లి లోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మరియు కోదండరాం లు దాదాపు మూడు గంటల పాటు జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం కుంతియా అభ్యర్థి ఖరారు ప్రకటన చేస్తూ, జనగామ స్థానాన్ని కాంగ్రెస్ కి ఇచ్చేందుకు కోదండరాం అంగీకరించారని, మహాకూటమి ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం కన్వీనర్‌’గా కోదండరాం ఉంటారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మహాకూటమి సీట్ల సర్దుబాటులో 14 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో తెలంగాణ జన సమితి, మరియు 3 స్థానాల్లో సిపిఐ ఎన్నికల బరిలో పోటీచేస్తాయని, మహాకూటమి తరపున కోదండరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కుంతియా తెలిపారు.

Ponnala-Lakshmaiah-MLA