మకుటం లేని మహారాణి

మకుటం లేని మహారాణి

ముంబయి భామ పూజా హెగ్డే ఊపు ఇప్పుడు మామూలుగా లేదు. ఆమె టాలీవుడ్లో ప్రస్తుతం మకుటం లేని మహారాణి. ఆల్రెడీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్లతో ఆడి పాడేసింది. మిగతా బడా స్టార్లు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తితో ఉన్నారు. మరే హీరోయిన్ కూడా పూజాకు దరిదాపుల్లో లేరిప్పుడు.

మరోవైపు తన మాతృభాష హిందీలోనూ పూజాకు మంచి డిమాండే ఉంది. ఆల్రెడీ ఆమె హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో నటించింది. త్వరలోనే ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోందంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈలోపు ఒక క్రేజీ, భారీ చిత్రంలో పూజాకు అవకాశం దక్కింది. ఆ సినిమా పేరు.. సర్కస్.

బాలీవుడ్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా, హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి రూపొందించబోయే కొత్త కామెడీ మూవీ సర్కస్. ఇంతకుముందు అతడితో ‘సింబా’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన రణ్వీర్ సింగ్ ఇందులో హీరోగా నటించనున్నాడు. అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇంతకుముందు ‘గోల్ మాల్’ సిరీస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోహిత్.. ఇప్పుడు ‘సర్కస్’ను కూడా కామెడీ ఫ్రాంఛైజీగా రూపొందించనున్నాడట. అంటే ఈ సిరీస్‌లో ఆ తర్వాత కూడా సినిమాలు వస్తాయన్నమాట. అదే నిజమైతే పూజా పంట పండినట్లే.

చివరగా పూజా ‘హౌస్ ఫుల్-4’లో నటించింది. దానికి నెగెటివ్ టాక్ వచ్చినా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఓవైపు సల్మాన్ సినిమాలో ఛాన్స్ అనుకుంటుండగానే.. రణ్వీర్‌తో నటించే అవకాశం రావడం పట్ల పూజ ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే పూజా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రంతో పలకరిస్తుంది.