ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనుకున్న పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడి సినీ ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ వాయిదా పడిన చిత్రాలలో డార్లింగ్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ ‘రాధేశ్యామ్’ కూడా ఉంది. దీని తర్వాత మళ్లీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ తాజా రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో చెప్పింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డె.
‘విభిన్నమైన లవ్ స్టోరీస్లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రాధేశ్యామ్ సినిమాతో నా కల నెరవేరింది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రేరణగా నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో హీరోయిన్ రోల్ అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో రాధేశ్యామ్ క్లిష్టమైనది. ఇది ఒక పీరియాడికల్ సినిమా కావడంతో ప్రేరణ పాత్రలో ఒదిగిపోయేందుకు ఎంతో రీసెర్చ్ చేశా.’ అని పూజా హెగ్డె తెలిపింది. అభిమానులు, ప్రేక్షకులలాగే తాను కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎదురుచూస్తున్నాని పేర్కొంది.