పంజాబీ ప్రముఖ గాయకుడు శార్దుల్ సికందర్ కన్నుమూశారు. ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవల శార్దుల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స పొందుతున్న శార్దుల్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విటర్‌లో తెలిపారు. సింగర్ మృతిపట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంతాపం ప్రకటించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. పంజాబ్ వాసులు గొప్ప సింగర్, నటుడిని కోల్పోయారని పేర్కొన్నారు. ఆయన మరణం పంజాబీ ఫిలిం ఇండస్ర్టీకి తీరని లోటు అని అన్నారు. సీఎంతోపాటు శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఇతర ప్రముఖులు, గాయకులు శార్దుల్ మృతిపై దిగ్భ్రాంతి ప్రకటించారు.
కాగా శార్దూల్ సికిందర్ పంజాబీ ఫోక్ సింగర్, పాప్ సింగర్. 1980లో ఆయన రోడ్‌వేస్ ది లారీ పేరిట మొదటి ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత శార్దూల్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన నటనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. జగ్గా దకురా మూవీలో శార్దూల్ నటన ఎందరినో మెప్పించింది.