ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్‌తో తన సినీ ప్రయాణాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. వేణు మంచి హాస్యనటుడని, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ నవ్వించేవారని వెల్లడించారు. ఈ మేరకు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘‘అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారు అనుకున్నాను.
నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. ‘గోకులంలో సీత’ నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు.పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అన్నవరం’ సినిమాలో తన స్నేహితుడిగా నటించాడు.హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు.మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి నా తరఫున, జనసైనికుల తరఫునా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను’’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
