Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయ సినిమాకు సంబంధించి బాహుబలి సాధించని రికార్డు లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి… ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు ఏ భాషలో వచ్చే పెద్ద సినిమాకు అయినా… బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడం లక్ష్యంగా మారింది. ముఖ్యంగా హిందీ సినిమాలన్నీ బాహుబలిని టార్గెట్ చేస్తున్నాయి… కానీ ఇప్పుడప్పుడే బాహుబలి రికార్డులను చేరుకోవడం.. ఎంత పెద్ద హిందీ సినిమాకయినా అంత సులువు కాదు. బుల్లితెరపై తాజాగా నమోదయిన రికార్డులే ఇందుకు ఉదాహరణ. ఈ నెల 8న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా వివిధ చానళ్లో ప్రసారమైన బాహుబలి… అన్ని భాషల్లోనూ అధికంగా టీఆర్పీలు సాధించింది.
ఇటీవల వివిధ చానళ్లలో ప్రసారమయ్యే సినిమాలకు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంప్రెషన్స్ ఇస్తోంది. ఇలా అక్టోబరు 7 నుంచి 13 వరకు హిందీలో ప్రసారమైన సినిమాల్లో అత్యధిక ఇంప్రెషన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలు బార్క్ వెల్లడించింది. సోనీ మ్యాక్స్ చానల్ లో ప్రసారమైన బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రం 26,054 ఇంప్రెషన్స్ తో ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. అర్బన్ ప్రాంతాల్లోనూ 17, 671 ఇంప్రెషన్స్ తో బాహుబలే టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పటిదాకా ఏ సినిమా ఈ రికార్డు సాధించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. బుల్లితెరపై బాలీవుడ్ బడాహీరోల సినిమాలను సైతం బాహుబలి పక్కకు నెట్టింది. బాహుబలి ప్రసారమైన వారంలోనే టీవీలో వచ్చిన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ చిత్రం 5, 195 ఇంప్రెషన్స్ మాత్రమే దక్కించుకుంది.