ప్రభాస్‌ను బందీ చేసిన యువి క్రియేషన్స్ అధినేతలు

ప్రభాస్‌ను బందీ చేసిన యువి క్రియేషన్స్ అధినేతలు

స్టార్ హీరోలు అన్నాక అభిమానుల్ని పట్టించుకోవాల్సిందే. వాళ్ల మానాన వాళ్లను వదిలేస్తామంటే కుదరదు. సినిమా రిలీజ్ ముంగిట దాన్ని అభిమానులు నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేస్తారు. థియేటర్ల దగ్గర హంగామా చేస్తారు. యాంటీ ఫ్యాన్స్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే.. అడ్డం పడతారు. ఇంకా తమ ఆరాధ్య కథానాయకుల కోసం ఎంతో చేస్తారు. అంత చేసి వాళ్లు కోరుకునేది అప్పుడప్పుడూ తమ హీరో సినిమాలకు సంబంధించి కొన్ని అప్ డేట్స్. సందర్భానుసారంగా కొన్ని ట్రీట్స్.

ఐతే మిగతా స్టార్ హీరోల్లా హడావుడి లేకుండా తన పని తాను చేసుకుపోయే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. అభిమానుల గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించడు. అలాంటపుడు అతడితో పనిచేసే నిర్మాతలు అయినా కొంచెం ఫ్యాన్స్ మనోభావాల్ని దృష్టిలో ఉంచుకోవాలి.ఐతే ‘బాహుబలి’ తర్వాత తమ సంస్థలో ప్రభాస్‌ను బందీ చేసిన యువి క్రియేషన్స్ అధినేతలకు అభిమానులంటే లెక్కే లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

‘సాహో’ సినిమాకు సంబంధించి నెలల తరబడి ఏ అప్ డేట్ లేకుండా.. ఆ సినిమా నుంచి అభిమానుల్ని అలరించే ప్రోమోలు కూడా ఏమీ వదలకుండా మౌనం వహించడం ద్వారా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. యువి ఆఫీస్ దగ్గరికెళ్లి అభిమానులు గొడవ చేసే వరకు వ్యవహారం వెళ్లింది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యువి వాళ్లకు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేశారు కూడా. వ్యతిరేకత తీవ్రమయ్యాక కానీ యువి వాళ్లు స్పందించలేదు.

ఇప్పుడు మరోసారి ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ‘సాహో’ విడుదలై దాదాపు మూడు నెలలు అవుతుండగా.. ప్రభాస్ తర్వాతి సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. మళ్లీ ఎప్పుడు షూటింగ్, సినిమా విశేషాలేంటి.. రిలీజ్ ఎప్పుడు.. ఫస్ట్ లుక్ ఎప్పుడు అనే సమాచారం ఏదీ లేదు.