ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ట్విటర్లో ఓ బిగ్ సర్ప్రైజ్ షేర్ చేసింది. దిగ్గజ నటుడు అబితాబ్ బచ్చన్ తమ సినిమాలో నటిస్తున్నారని పేర్కొంది.
ఆయన సినిమాలకు సంబంధించిన వివరాలతో 27 సెకండ్ల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. భారతీయ సినిమా లెజెండ్ లేకుండా లెజెండరీ ఫిల్మ్ ఎలా తీయగలమని పేర్కొంది. ‘కోట్లాది భారతీయుల అభిమాన నటుడు. బిగ్ బీ అమితాబ్‌కి ఇదే మా సాదర ఘన స్వాగతం. ఆయన రాకతో మా జర్నీ మరింత BIG-ger! అయింది’అని వైజయంతీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.