ప్రజా దర్బార్ వాయిదా…ఎందుకంటే ?

Praja darbar postponed

ప్రజా సమస్యల పరిష్కారంలో తండ్రి  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో నడవాలని భావించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, జనం సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం కోసం జూలై 1 నుంచి ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని బేగంపేట క్యాంప్ ఆఫీస్‌ లో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ప్రజా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించేవారు. దీనికి ప్రజల నుంచి అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. అదే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అయితే, జులై 1న ప్రారంభం కావాల్సిన ప్రజా దర్బార్ వాయిదా పడింది. దీనిని ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నారు. దీనికి ఇంకా ఏర్పాట్లు పూర్తి కాకపోవడం వలన ఆగస్టు 1కి వాయిదా వేసినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ విషయం మీద నిన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్‌ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని అన్నారు. శాసనసభ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి రోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని తెలిపారు. అందుకే శాసనసభ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్‌ ప్రారంభం కానుందని అయన పేర్కొన్నారు.