ప్ర‌ధాని నిజంగా సంతోషంగా ఉన్నారా…?

prakash raj sensational comments on modi over gujarat elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జ‌ర్న‌లిస్టు గౌరీలంకేశ్ హ‌త్య త‌ర్వాత ప్ర‌ధానిమోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల పైనా స్పందించారు. ప్రియ‌మైన ప్ర‌ధాని గారికి … విజ‌యంసాధించినందుకు శుభాకాంక్ష‌లు అంటూనే … మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా అని ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్నించారు. 150కి పైగా సీట్లు సాధిస్తామ‌ని ప్ర‌ధాని చెప్పార‌ని, మ‌రి అన్ని స్థానాల్లో ఎందుకు గెల‌వ‌లేక‌పోయామో ఒక‌సారి పున‌రాలోచించుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్ సూచించారు. స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నాయో, వాటిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలుసుకోవాల‌న్నారు. విభ‌జ‌న రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేద‌ని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లను, పేద‌ల‌ను, రైతుల‌ను మోడీ నిర్ల‌క్ష్యం చేశార‌ని విమర్శించారు. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంచేసిన వారి గొంతు ఈ ఎన్నిక‌ల్లో వినిపిస్తోంద‌ని, మీరు వింటున్నారా… అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ప్ర‌కాశ్ రాజ్ లాంటి న‌టులే కాదు… కాంగ్రెస్ నేత‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం గుజ‌రాత్ లో బీజేపీ గెలుపుపై పెద‌వి విరుస్తున్నారు. చచ్చీ చెడీ గెలిచామ‌న్న రీతిలో బీజేపీ గుజ‌రాత్ లో విజ‌యం సాధించింద‌ని… నైతికంగా ఇది గెలుపే కాద‌ని వారు వాదిస్తున్నారు. భావోద్వేగాల‌కు సంబంధించిన అంశాల‌పై ప్ర‌చారం చేయ‌డం వ‌ల్లే బీజేపీ ఈ మాత్రం గెలుపును సాధించింద‌ని రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి, గుజ‌రాత్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. తాను గుజ‌రాత్ వాడిన‌ని, ఈ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే గుజ‌రాత్ గౌర‌వానికి భంగం కలుగుతుంద‌ని మోడీ ప్ర‌చారం చేసుకున్నార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌చారం చేసింద‌ని, ద‌ళితులు, గిరిజ‌నులు, రైతులు, వ్యాపారులకు సంబంధించిన అంశాల‌పైనే త‌మ ప్ర‌చారం సాగింద‌ని ఆయ‌న తెలిపారు.

గుజ‌రాత్ లో ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ అసలైన విజ‌యం సాధించింది మాత్రం కాంగ్రెస్, రాహుల్ గాంధీనే అని గెహ్లాట్ అభిప్రాయ‌ప‌డ్డారు. గుజ‌రాత్ ఓట‌మికి రాహుల్ బాధ్య‌త తీసుకుంటారా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం ఆయ‌న స‌మాధానం దాట‌వేశారు. ఇది ఊహాజ‌నిత ప్ర‌శ్న అని తోసిపుచ్చారు. అటు ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించిన‌ప్ప‌టికీ ఆరుజిల్లాల్లో ఖాతా తెర‌వ‌లేక‌పోవ‌డం బీజేపీని కూడా షాక్ కు గురిచేస్తోంది. అమ్రేలీ, న‌ర్మ‌ద‌, పోరుబంద‌ర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ గెల‌వ‌లేక‌పోయింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే…ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బాగానే ప్ర‌భావం చూపిన‌ట్టు అర్ధమ‌వుతోంది.