ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబాయి పర్యటన ఒకందుకు చేస్తే అది రాష్ట్రానికి మరొకందుకు కూడా ఉపయోగపడేలా కనిపిస్తోంది. అమరావతి బాండ్ లను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసేందుకు ముంబయి వెళ్లిన ఆయన ఈ పర్యటనలోనే ఏపీ ప్రభుత్వం తరపున మరికొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి రాష్ట్రంలో 25 ఎకరాల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో నిఘా పరికరాల పరిశ్రమ నెలకొల్పేందుకు హిక్ విజన్ ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ఏపీలో ప్లాంట్ నెలకొల్పితే నెలకు 15 లక్షల కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ సంస్థ తయారుచేయగలదని ఆ సంస్థ చెబుతోంది . ఏడాది కాల వ్యవధిలోనే ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు. తిరుపతి సమీపంలో యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఒక రోజు ముంబయి పర్యటనలో భాగంగా చంద్రబాబు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో మొదట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తర్వాత పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై చర్చించారు. ఏపీలో ఉన్న మానవ వనరులు, అపారమైన భూమి, ఇతర వనరుల గురించి వారికి వివరించి చెప్పారు. వెల్‌స్పన్ సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ గోయెంకా, రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ ఎండీ నదిర్ గోద్రెజ్ ల తో సీఎం విడివిడిగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సంస్థ విస్తరణ ప్రణాళికలపై నదిర్ చర్చించారు. మహీంద్రా వరల్డ్ సిటీ సీఈవో సంగీతా ప్రసాద్ చెన్నై, జయపురలలో తమ ప్రాజెక్టులను గురించి సీఎంకు వివరించారు. మరో పక్క ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.