Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2011 న ముంబైపై జరిగిన ఉగ్రదాడి భారత్ లోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సముద్రతీరం గుండా భారత్ లోకి అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమం సృష్టించారు. ప్రభుత్వం కూడా ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. దీంతో భారత్ లో పర్యటిస్తున్న పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీని తక్షణమే దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఈ విషయాన్నిముంబై దాడుల సమయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో వెల్లడించారు.
తన జీవిత చరిత్రలో మూడో వాల్యూమ్ అయిన ది కొలీషన్ ఇయర్స్ 1996-2012 అనే పుస్తకంలో ప్రణబ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముంబై దాడుల నేపథ్యంలో దేశమంతా పాక్ పై ఆగ్రహంతో ఉన్న వేళ, పాక్ మంత్రి ఖురేషీ తన పర్యటనలో రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రణబ్ ఓ జర్నలిస్ట్ ద్వారా ఖురేషీతో ఫోన్ లో మాట్లాడారు. ప్రెస్ మీట్ కు వెళ్తున్న జర్నలిస్ట్ తో ఖురేషీని తనతో ఫోన్ మాట్లాడించాలని ప్రణబ్ కోరారు. ఆ జర్నలిస్టు ఇచ్చిన సమాచారంతో ఖురేషి ప్రణబ్ కు ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖురేషీ ఇక్కడ పర్యటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఆయన్ను స్వదేశం చేర్చడానికి భారత్ అధికారిక విమానం సిద్దంగా ఉందని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది..అని ప్రణబ్ ఖురేషీని హెచ్చరించారు.
కొద్ది సేపటి తర్వాత పాక్ రాయబారి ప్రణబ్ కు ఫోన్ చేసి ఖురేషీ కృతజ్ఞతలు చెప్పమన్నారని తెలిపారు. ఖురేషీ కోసం పాక్ వాయుసేన విమానం ఏర్పాటుచేస్తుందని చెప్పారు. మంబై దాడుల అనంతరం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ వైఖరిపై చర్చ జరిగింది దాడుల తర్వాత భద్రతను పర్యవేక్షించాల్సిన శివరాజ్ పాటిల్..దానిపై దృష్టిపెట్టకుండా…మీడియా ముందుకొచ్చినప్పుడల్లా డ్రెస్ మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. జాతీయ మీడియా శివరాజ్ పాటిల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీడబ్ల్యూసీ మీటింగ్ లోనూ దీనిపై చర్చ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ మంత్రి చిదంబరం పాటిల్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో రెండురోజుల తర్వాత ఆయన రాజీనామా సమర్పించారు. హోం శాఖ బాధ్యతల్ని ప్రణబ్ కు అప్పగించాలని సోనియా భావించారు. అయితే అప్పటికే విదేశీ వ్యవహారాల శాఖను చూస్తున్న ప్రణబ్ కు ఇది అదనపు భారంగా మారుతుందని భావించిన మన్మోహన్ సింగ్..హోంశాఖను చిందబరానికి అప్పగించారు.