కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసాదం పథకం కింద విశాఖపట్నంలోని సింహాచలం నరసింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ పథకం కింద సింహాచలం ఆలయానికి అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు 55 కోట్లు మంజూరు చేశారు.
ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్, సింహాచలం ఇఒ వి.త్రినాధరావు, ట్రస్టుబోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజ్, సంపంగి శ్రీను, దొడ్డిరమణ శుక్రవారం సింహాచలం దేవస్థానంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పుష్కరణి సత్రం నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించబడిందన్నారు. దాని స్థానంలో కొత్త సత్రం నిర్మించనున్నారు. అయితే దాని మధ్యలో ఉన్న కళ్యాణ మండపం దాని స్థానంలోనే ఉంటుంది. 1936లో నిర్మించిన ఆగమ పాఠశాలను కొత్త ప్రదేశానికి, కొత్త భవనానికి మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనాన్ని ఆధునికీకరించి ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. దేవస్థానం ఈఓ కార్యాలయాన్ని కూడా నిర్మించాల్సి ఉందని సత్యనారాయణ తెలిపారు.
రెండో టోల్‌గేట్ వద్ద పార్కింగ్‌కు విశాలమైన సౌకర్యాలు కల్పిస్తామని, టూరిజం శాఖ స్థలం సమకూర్చుతుందని అధికారులు తెలిపారు.