తెలంగాణా మొత్తం ముందస్తు ఎన్నికల ఫీవర్

pre elections fever in telangana

తెలంగాణలో ముందస్తుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్, రేపు అసెంబ్లీ రద్దు చేయనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. కాంగ్రెస్ అయితే ఈ రోజు సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు, ఒకవేళ అసెంబ్లీ రద్దయితే, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న అంశాలపైనే ఈ చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఆయన కంటికి ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందువల్లే ఆయన ముఖేష్ గౌడ్ ఇంటికి రాబోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

kcr

మరో పక్క అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా వ్యూహ రచన చేస్తున్నారు. ఆయనకు కలిసి వచ్చిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే ఆయన వ్యూహాలను రచిస్తున్నారు. ఇదే సమయంలో అయున టీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు చేశారు. ముందస్తుకు సన్నద్ధంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకోపక్క తెలంగాణలో జరిగే ఎన్నికలకు స్వయంగా రంగంలోకి దిగి, రాష్ట్ర ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకుంటానని తెలంగాణా బీజేపీ నేతలకు అమిత్ షా హామీ ఇచ్చారని తెలుస్తోంది.

kcr

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నందున, అక్కడ తన అవసరం ఉండదని అందుకే తెలంగాణపైనే తన దృష్టంతా పెడతానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నెల 12 లేదా 15న మహబూబ్ నగర్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిద్దామని ఆయన చెప్పారని తెలుస్తోంది. అలాగే రేపు అందరూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రులకు పిలుపు వెళ్లినట్టు సమాచారం అందుతోంది. రేపు అత్యంత కీలకమైన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

kcr