నిండు గర్భిణి నొప్పులతో విలవిలలాడుతుంటే.. 20 కిలోమీటర్ల దూరం నుంచి అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూడకుండా స్థానికులు ఆమెకు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. మహిళా పారిశుధ్య కారి్మకులు, సమీపంలో కూరగాయలు కొనేందుకు వచ్చిన 108 ఉద్యోగి, స్వచ్ఛంద సేవచేసే దంపతులు.. అందరూ ఒక్కటై సాయం చేశారు. ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరు గ్రామానికి చెందిన యాసారపు మార్తమ్మ నిండు గర్భిణి. భర్త రమేశ్‌తో కలసి నిజామాబాద్‌లో కూలిపనులు చేసుకుని జీవిస్తోంది. దసరా పండుగ కోసం సొంతూరుకు వెళ్లేందుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరగా..మధిర రైల్వే స్టేషన్‌కు వచ్చేసరికి నొప్పులు మొదలయ్యాయి. దంపతులు స్టేషన్‌లో దిగి బయట కొస్తుండగా ఆవరణలోనే మార్తమ్మ కూలబడిపోయింది.
విషయం తెలుసుకున్న మధిర రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. 20 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న బనిగండ్లపాడు పీహెచ్‌సీ నుంచి రావాల్సి ఉందని సిబ్బంది తెలపడంతో.. ఆయన స్థానికంగా స్వచ్ఛంద సేవ చేసే మధిర రెస్క్యూ టీం రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన తన భార్య జ్యోతితో కలసి అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో సమీపంలోని మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన 108 ఉద్యోగి గజ్జలకొండ శివ ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు.
మహిళా పారిశుధ్య కార్మికులు చుట్టూ చాటు కోసం దుప్పట్లు పట్టుకుని నిల్చోగా, ఆరుబయటే సాధారణ కాన్పు చేశారు. మార్తమ్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచి్చంది. ఆ తర్వాత రామకృష్ణ దంపతులు కారులో ఆమెను తీసుకెళ్లి మధిర ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యసిబ్బంది తెలిపారు.