కట్టుకున్న భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని భర్త అనుమానించ సాగాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఆల్వాన్పల్లికి చెందిన కృష్ణమ్మ , కృష్ణయ్య సుమారు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి.
అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డపై అనుమానం పెంచుకున్న భర్త కొన్ని రోజులుగా తాగొచ్చి ఆమెను కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మంగళవారం మృతురాలి సోదరుడు మల్లన్న ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేందర్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.