రోజుకో సరికొత్త టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పలుచోట్ల మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మతున్నారంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. పైగా ఈ మూఢనమ్మకాల మాయలో అత్యంత క్రూరమైన పనులకు ఒడిగడుతున్నారు. అంతేకాదు ఈ మూఢనమ్మకాల మాయలో తమ జీవితాలను బలి చేసుకున్నవాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ మగపిల్లాడి కోసం భూతవైద్యుడి మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
అసలు విషయంలోకెళ్తే… పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివశిస్తున్న ఒక గర్భిణికి ముగ్గురు ఆడపిల్లలు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో భూతవైద్యుడిని సంప్రదించింది. అయితే ఆ భూతవైద్యుడి మగపిల్లాడు కావాలంటే తలలో మేకు దించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ మగపిల్లాడి మీద ఆశ కొద్దీ అంగీకరించింది. ఈ మేరకు ఆ భూత వైద్యుడు ఆమె తలపై ఒక సుత్తితో మేకుని దించేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి నొప్పికి తాళలేక పోయింది. పైగా ఆ భూత వైద్యుడు మేకు తీయడానికి ప్రయత్నిస్తే అది తలలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్యులు ఆపరేషన్ చేసి ఆ మేకును తీసేశారు. అంతేకాదు మగపిల్లాడు కోసం తాను ఈ చర్యకు పాల్పడ్డానని, భూతవైద్యుడే సుత్తితో మేకుని తలలోకి దించాడని వైద్యులకు ఆ బాధితురాలు తెలిపింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పెషావర్ పోలీసులు రంగంలోకిదిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.