డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి

డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి

ప్రసవం కోసం వచ్చిన మహిళ డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ మన్సూరాబాద్‌ చంద్రపురికాలనీలోని అరుణ ఆసుపత్రిలో బంధువులు ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన మేరకు.. చింతలకుంట చెక్‌పోస్ట్‌ సమీపంలో ఇంజనీర్స్‌కాలనీలో సువర్ణ–లక్ష్మణ్‌ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె ప్రతిభ(27)ను శుక్రవారం మధ్యాహ్నం ప్రసవం కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

సాధారణ కాన్పు చేద్దామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాన్పు కావటం లేదని చెప్పి ఆపరేషన్‌ చేశారు.ప్రసవం అనంతరం శిశువు ఆక్సిజన్‌ తీసుకోవటం లేదని, బాలింతకు రక్తస్రావం జరుగుతుంతోందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తప్రసరణ నివారణకు ఆపరేషన్‌ చేయడంతో మరో రెండు ఆపరేషన్లు చేశారన్నారు. అయితే శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉందని, అవెర్‌గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు.

అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో మృతి చెందింది. దీంతో ఆదివారం బంధువులు, కాలనీవాసులు ఎల్‌బీనగర్‌లోని అరుణ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ‘డాక్టర్‌ నిరక్ష్యం వల్లే మృతి చెందింది… మాకు న్యాయం చేయాలంటూ’ నిరసనకు దిగారు. దీంతో ఎల్‌బీనగర్‌ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే.. అరుణ ఆసుపత్రి వైద్యురాలిని వివరణ కోసం ప్రయత్నిస్తే అందుబాటులో లేరు. సిబ్బంది కూడా లేరు.