ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసిన ఘటనపై తాజాగా కీలక మలుపు తీసుకుంది. అయితే ఇటీవల బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు. దళితుడికి అన్యాయం జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని, తాను నక్సలైట్లలో కలుస్తానని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన రాష్ట్రపతి ఈ కేసు ఫైల్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు దీనిని అత్యవసర కేసుగా పరిగణించి వెంటనే విచారణ జరపాలంటూ రాష్ట్రపతి సెక్రటరీ అశోక్ కుమార్ ఆదేశాలిచ్చారు. గతంలో దీనిపై సీరీయస్ అయిన రాష్ట్రపతి బాధితుడు వరప్రసాద్‌కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని, శిరోముండనం కేసు విషయంలో ఆయనకు సహకరించాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. జనార్దన బాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్ వాపోయాడు. ఈ నేపథ్యంలో కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.