వైద్యుల భద్రతపై కేంద్ర ఆర్దినెన్స్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుంది. ఈ సమయంలో కరోనా కట్టడికి కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అందుకోసం లాక్ డౌన్ వేళ కేంద్రం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కరోనా కోసం ప్రాణాలను సైతం తెగించి నిరంతరం పనిచేస్తున్న సమయంలో డాక్టర్లపై కొందరు జరుగుతున్న దాడులపై మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాలి. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోన్న ఈ తరుణంలో అనేకమంది డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారు. అయితే పలు చోట్ల వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఈ దాడులపై కేంద్రం సీరియస్ అయ్యింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది. 1897 నాటి ఎపిడెమిక్‌ డిసీజెస్‌ చట్టంలో మార్పులు చేసి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి వచ్చింది. కాగా కరోనా కాలంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఈ ఆర్డినెన్స్‌ అమల్లో ఉంటుంది.