ప్రస్టేషన్ : మాస్క్ కొసం ఇంత పనా

కరోనా మహమ్మారి నుంచి బయట పడేందుకు దేశమంతా లాక్ డౌన్ నియమబద్దంగా పాటిస్తుంది. లాక్‌డౌన్ అతిక్రమించి గుట్టుగా హోటల్ నడుపుతున్న రాజ్‌బీర్.. మాస్క్ పెట్టుకోమన్నందుకు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాము ఇబ్బందులను కొనితెచ్చుకోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోని నెట్టేస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.

కాగా హర్యానాలోని గురుగ్రామ్ లో మాస్క్ ధరించమని.. దుకాణం మూసివేయమని చెప్పినందుకు ఓ హోటల్ యజమాని కట్టుకున్న భార్యనే చితకబాది రోడ్డున పడేశాడు. ఈ ఘటన జమల్‌పూర్‌ ఏరియాలోని ఫరూఖ్‌నగర్‌లో స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా అదే ప్రాంతానికి చెందిన రాజ్‌బీర్ అనే వ్యక్తి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ… రాజ్‌బీర్ గుట్టుగా తన దుకాణం తెరిచి వ్యాపారం చేసుకుంటున్నాడు.

కాగా కనీసం మాస్క్ కూడా ధరించకుండా వెళ్తుండడంతో అతని భార్య అడ్డుచెప్పింది. ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని వారించింది. అయినా వినకుండా ఉదయం హోటల్ తెరిచేందుకు వెళ్తున్న భర్తని కనీసం మాస్క్ అయినా ధరించాలని ఆవేదనకు లోనైంది. దీంతో కోపం వచ్చిన భర్త ఆమెను దుర్భాషలాడుతూ ఇంటి నుంచి హోటల్‌కు వెళ్లిపోయాడు. టీకి తిరిగొచ్చిన తర్వాత అదే విషయంపై భార్యాభర్తల మధ్య వివాదం రేగింది. రాజ్‌బీర్ భార్యను బండబూతులు తిడుతూ.. తీవ్రంగా కొట్టాడు. తన తల్లితో కలసి బెల్టుతో చావబాది ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. తీవ్రగాయాలపాలైన భార్య మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. రాజ్‌బీర్ హోటల్ ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు కూడా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.