ఆలయంలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. తనకు తానే కాళికామాత అవతారంగా ప్రకటించుకున్న ఆ పూజారిని ఓ దుండగుడు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు.
ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢాక్‌నగ్ల గ్రామంలోని ఆలయంలో పూజారి జై సింగ్ యాదవ్ (75) ఆలయ ఆవరణలో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 20 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే జై సింగ్ యాదవ్ తనకు తాను కాళికామాత అవతారంగా ప్రకటించుకుని ఆ మేరకు చీర, గాజులు ధరించి కనిపించేవాడు. స్థానికంగా ఆయన సఖీ బాబాగా పేరు పొందాడు. సఖీబాబాను కలిసేందుకు శనివారం రాంవీర్ యాదవ్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ విషయమై సఖీబాబాకు, రాంవీర్‌కు మధ్య వివాదం పెరిగింది.
ఈ సమయంలో మాటామాట పెరగడంతో రాంవీర్ క్షణికావేశంలో సఖీ బాబాను కత్తీతో పొడిచి హత్య చేశాడు. కేకలు విన్న స్థానికులు రాంవీర్‌ను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే సఖీబాబా ఉండేవాడు. ఐపీసీ సెక‌్షన్ 302 ప్రకారం నిందితుడిపై హత్య కేసును నమోదు చేశామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఎందుకు హత మార్చాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు.